పారిస్ ఒలింపిక్స్‌లో భారత అభిమానులను రమిత(Ramita Jindal) నిరాశపరిచింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మహిళల ఫైనల్స్‌లో ఆమె ఏడో స్థానానికి పరిమితమైంది. తొలిసారి ఒలింపిక్స్‌లో పోటీ పడిన రమిత.. తన ఓటమిపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఓడినందుకు బాధగా ఉన్నా ఇక్కడికి రావడం వల్ల ఎంతో నేర్చుకోగలిగినందుకు ఆనందంగా కూడా ఉందని చెప్పుకొచ్చింది. తనకు ఈ అనుభవాలు భవిష్యత్తులో ఎంతగానో ఉపయోగపడతాయని, మరింత మెరుగుపడటానికి ఈ అనుభవాలను, పాఠాలను సోపానాలుగా చేసుకుంటానని వివరించింది.
‘‘ఇక్కడ పోటీల అనుభవం ఎంతో బాగుంది. ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. భవిష్యత్తులో మరింత మెరుగుపడటానికి శ్రమిస్తా. అందుకు ఇక్కడి అనుభవాలను వినియోగించుకుంటా’’ అని రమిత తెలిపింది. రమిత వ్యాఖ్యలు విన్నవారిలో అనేక మంది ఆమెను ప్రశంసిస్తున్నారు. భవిష్యత్తులో రమిత(Ramita Jindal) తప్పకుండా ఉన్నత శిఖరాలను అందుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.