మాజీ స్టార్ క్రికెటర్స్ యువరాజ్ సింగ్(Yuvraj Singh), సురేష్ రైనా(Suresh Raina), హర్బజన్ సింగ్(Harbhajan)లపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. అందుకు తాజాగా ‘తౌబ తౌబ’ అనే పాటతో వారు చేసిన యూట్యూబ్ రీలే కారణం. అందులో వారు దివ్యాంగుల మనోభావాలను దెబ్బతీసేలా వీడియోలు చేశారంటూ నేషనల్ కౌన్సిల్ ఫర్ ప్రమోషన్ అండ్ ఎంప్లాయ్‌మెంట్ ఫర్ డిజేబుల్డ్ పీపుల్(NCPEDP) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అర్మన్ అలీ.. ఢిల్లీలోని అమర్ కాలనీ పోలీస్ స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దివ్యాంగులను వెక్కిరించేలా వీడియోలు చేసిన మాజీ స్టార్ క్రికెటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, మరోసారి ఎవరూ ఇలా చేయకుండా ఉండటానికి వీరి కేసు ఉదాహరణగా మారాలని కూడా చాలా మంది కోరుతున్నారు.
వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 గెలిచిన జోష్‌లో ఈ ముగ్గురు ప్లేయర్లు ఓ రీల్ చేశారు. అందులో ముగ్గురు హీరోలు నడుము పట్టుకుని, కుంటుకుంటూ నడుస్తూ కనిపించారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ‘‘నిర్విరామంగా 15 రోజులు క్రికెట్ ఆడుతూ ఉండటంతో మా శరీరాలు కూడా ‘తౌబ తౌబ’ అయ్యాయి. ప్రతి అవయవం నొప్పిగా ఉంది. గెలిచిన జోష్‌లో మా వెర్షన్ తౌబ తౌబ డ్యాన్స్ ఇదే’’ అంటూ రాసుకొచ్చారు. వీరి వీడియో కాస్తా వైరల్ కావడంతో దీనిపై దివ్యాంగుల హక్కుల కార్యకర్తలు స్పందించారు. దివ్యాంగులను వెక్కిరిస్తున్న వీడియోపై మండిపడ్డారు అర్మన్ అలీ. ఇలాంటి కంటెంట్‌ను చేసిన క్రికెటర్లపైనే కాకుండా దీనిని అనుమతించిన సోషల్ మీడియా సంస్థపై కూడా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
దీనిపై స్పందించిన రాజ్యసభ ఎంపీ హర్భజన్ సింగ్(Harbhajan).. వెంటనే వీడియోను డిలీట్ చేసి క్షమాపణలు చెప్పారు. తాము ఉద్దేశపూర్వకంగా ఎవరి మనోభావాలను దెబ్బతీయాలని చేయలేదని చెప్పారు. తమ నొప్పుల బాధను చూపడానికే తాము ఇలా చేశామని, ఎవరి మనోభావాలైన దెబ్బతిని ఉంటే క్షమించాలని హర్భజన్ వివరించారు.