టెన్నిస్‌లో ఓ అద్భుత అధ్యాయం ముగిసింది. టెన్నిస్ ప్రపంచంలో క్లే కింగ్‌గా పేరొందిన రాఫెల్ నాదల్(Rafael Nadal).. రాకెట్‌ను వదిలేశాడు. దాదాపు రెండు దశాబ్దాల పాటు తన ఆటతో టెన్నిస్ అభిమానులను అలరించి తన ఆటతో స్పెయిన్ వీరుడిగా నాదల్ పేరొందాడు. అత్యంత విజయవంతంగా కొనసాగిన తన కెరీర్‌ను ఓటమితో ముగించాడు. తన టెన్నిస్ కెరీర్‌లో డేవిస్ కప్(Davis Cup) చివరి టోర్నీ అని ప్రకటించాడు. కానీ నెదర్లాండ్స్‌తో మంగళవారం జరిగిన తొలి సింగిల్స్ మ్యాచ్ అతడి ఆఖరి మ్యాచ్ అయింది. ఈ మ్యాచ్‌లో బొటిక్ జాండ్‌షల్స్‌తో తలపడిన నాదల్ 4-6, 4-6తో ఓటమిపాలయ్యాడు. క్వార్టర్ ఫైనల్స్‌కు చేరిన స్పెయిన్.. నెదర్లాండ్స్ చేతితో 2-1 తేడాతో ఓడింది. దీంతో నెదర్లాండ్స్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్ తర్వాత నాదల్ రిటైర్మెంట్‌తో భావోద్వేగానికి గురైన ప్రరేక్షకులు ‘రఫా రఫా రఫా’ అని అరుస్తూ నాదల్‌పై తమ అభిమానాన్ని చాటుకున్నారు.
ఈ సందర్భంగా మ్యాచ్ నిర్వాహకులు నాదల్ కోసం సెంటర్ కోర్టులో ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వమించారు. ఈ సందర్భంగా అభిమానులను ఉద్దేశించి మాట్లాడిన తర్వాత తన కెరీర్ హైలెట్స్ చూపుతున్న వీడియోను వీక్షించాడు నాదల్. ఈ సందర్భంగా తన కెరీర్‌ను చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. 38 ఏళ్ల నాదల్ తన కెరీర్‌లో 22 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు సొంతం చేసుకున్నాడు. రికార్డు స్థాయిలో 14 ఫ్రెంచ్ ఓపెన్ టైటిళ్లు కైవసం చేసుకున్నాడు. గ్రాండ్‌స్లామ్‌ను డజన్‌కు పైగా గెలిచిన ఆటగాడు కూడా నాదల్ ఒక్కడే. ఈ సందర్భంగా అభిమానులను ఉద్దేశించి నాదల్(Rafael Nadal) మాట్లాడుతూ తనను ఓ మంచి మనిషిగా గుర్తు పెట్టుకోవాలని కోరాడు.
‘‘టైటిళ్లు, నంబర్లు అందరికి తెలిసినవే. కానీ మలోర్కాలో ఓ చిన్న గ్రామం నుంచి వచ్చిన ఓ మంచి మనిషిగా నన్ను అందరూ గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటున్నా. చిన్నప్పుడు కలలు కన్నా. ఆ కలలను నెరవేర్చుకోవడానికి ఎంతో కష్టపడ్డా. నేను అదృష్టవంతుణ్ని’’ అని చెప్పాడు. ‘‘నేను టెన్నిస్ ఆటలో అలసిపోలేదు. కానీ దేహం ఇంకెంతమాత్రం ఆడనంటోంది. కాబట్టి పరిస్థితిని నేను అంగీకరించాలి. నేను ఊహించినదానికన్నా ఎక్కువ కాలమే ఆడా. జీవితానికి, నాకు మద్దతిచ్చిన అందరికీ కృతజ్ఞతలు’’ అని నాదల్ అన్నాడు.