ఐపీఎల్(IPL) వేలం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా ఉంది. ఏ జట్టు ఎవరిని రిటైన్ చేసుకుంటుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ తీసుకున్న ఓ నిర్ణయం అభిమానులను షాక్‌లో పడేసింది. భారత్ జట్టులో స్టార్ ఆటగాడిగా పేరొందిన రిషబ్ పంత్(Rishabh Pant)ను రిటైన్ చేసుకోవడానికి ఢిల్లీ టీమ్ నిరాకరించింది. తాజాగా వచ్చిన ఐపీఎల్ రిటెన్షన్ లిస్ట్‌లో రిషబ్ పేరు లేకపోవడం దీనిని స్పష్టం చేస్తోంది. తన కెరీర్ ప్రారంభం నుంచి కూడా రిషబ్ పంత్ ఇదే జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నాడు. కాకపోతే ఇన్నాళ్లుగా జట్టుకు సేవలందించిన రిషబ్‌ను ఢిల్లీ(Delhi Capitals) ఎందుకు పక్కన పెట్టేసిందనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఈ విషయంపై రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి. కాగా మేనేజ్‌మెంట్ తీసుకున్న నిర్ణయాల కారణంగానే రిటెన్షన్ జాబితాలో రిషబ్ పేరు లేదని సమాచారం.
అందులోనూ కెప్టెన్సీ మార్చలన్న ఉద్దేశంతోనే ఢిల్లీ ఫ్రాంఛైజీ మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకుందని సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. వచ్చే రెండేళ్ల పాటు ఢిల్లీ జట్టుకు సంబంధించిన నిర్ణయాలను కూడా యాజమాన్య సంస్థ జీఎంఆర్ తీసుకోనుంది. ఇప్పుడు జట్టు నుంచి పంత్ వైదొలగడానికి ఇదే కారణమైందని క్రికెట్ విశ్లేషకులు అంటున్న మాట. ఇప్పటికే కోచింగ్ సెక్టార్‌లో కీలక మార్పులు చేసిన జీఎంఆర్.. తాజాగా జట్టులో కూడా పలు కీలక మార్పులు చేయాలని నిర్ణయించిందట. ఈ క్రమంలోనే జట్టు సారథ్యాన్ని రిషబ్‌కు కాకుండా వేరే వారికి ఇవ్వాలని సూచించిందని, అందుకే పంత్(Rishabh Pant) జట్టు నుంచి వైదొలిగాడని వార్తలొస్తున్నాయి. మరి ఇందుకు అసలు కారణం ఏంటో ఎప్పుడు తెలుస్తోందో చూడాలి.