దక్షిణాఫ్రికాతో జరగనున్న టీ20 సిరీస్‌లో భారత్ బోణీ కొట్టింది. తొలి టీ20 మ్యాచ్‌లోనే భారత టీమ్ ప్లేయర్లంతా చిచ్చరపిడుగుల్లా రెచ్చిపోయారు. బ్యాటర్లలో సంజు శాంసన్ బ్యాట్ ఊపుకు దక్షిణాఫ్రికా బౌలర్లు బెంబేలెత్తిపోయారు. ఏం చేయాలో అర్థం కాని స్థితిలోకి వెళ్లారు. అందుకు కారణం కేవలం 50 బంతుల్లోనే 107 పరుగులు చేసిన సంజు(Sanju Samson).. బౌండ్రీల వర్షం కురిపించాడు. దీంతో సంజుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు అభిమానులు, సీనియర్ ఆటగాళ్లు. తాజాగా ఈ జాబితాలోకి దక్షిణాఫ్రికా కెప్టెన్ మార్‌క్రమ్(Aiden Markram) కూడా చేరాడు. ‘‘మా జట్టు ఓడిపోవడం చాలా బాధ కలిగించింది. మా ప్రణాళికలను అనుకున్న స్థాయిలో అమలు చేయలేకపోయాం. సంజూ మాత్రం అదరగొట్టాడు’’ అని ప్రశంసలు కురిపించాడు.
‘‘సంజు ఆట అద్భుతంగా ఉంది. మా బౌలర్లను తీవ్ర ఒత్తిడికి గురిచేయడంలో గ్రాండ్ సక్సెస్ సాధించాడు. అతడిని అడ్డుకునే క్రమంలోనే మా వ్యూహాలు, ప్రణాళికలు గాడి తప్పాయి. వచ్చే మ్యాచ్‌లలో కొత్త ప్రణాళికలను సిద్ధం చేస్తాం. సంజును అడ్డుకోవడానికి, మరోసారి ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్నాం. భారత బ్యాటర్‌ను అభినందించడానికి నేను సిగ్గు పడటం లేదు. అతడి ఆట బాగుంది కాబట్టి ప్రశంసిస్తున్నారు. ఎవరి ఆట బాగున్నా నా స్పందన ఇలానే ఉంటుంది. ఒకవైపు క్రీజులో పాతుకుపోయి దూకుడుగా బంతిని బౌండ్రీలు దాటిస్తుంటే అలాంటి ఆటగాడిని ఆపడం కష్టం. సంజు ఇన్నింగ్స్‌ను అందరం అభినందించాల్సిందే’’ అని కొనియాడాడు మార్‌క్రమ్(Aiden Markram).