బంగ్లాదేశ్ సీనియర్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్(Shakib Al Hasan) మళ్లీ వన్డే జట్టు పగ్గాలు చేపట్టబోతున్నాడు. ఇటీవల వన్డే కెప్టెన్సీ నుంచి తమీమ్ ఇక్బాల్ తప్పుకున్న విషయం తెలిసిందే. దాంతో ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ టోర్నమెంట్లకు ముందు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(BCB) అనుభవజ్ఞడైన షకీబ్‌కు వన్డే పగ్గాలు అప్పగించింది. ఈ విషయాన్ని బీసీబీ ప్రెసిడెంట్ నజ్ముల్ హసన్ శుక్రవారం వెల్లడించారు. ‘బంగ్లాదేశ్ కెప్టెన్‌గా షకీబ్ మంచి చాయిస్. ఆసియా కప్, వరల్డ్ కప్ టోర్నీలకు ముందు అతని అనుభవం, నాయకత్వ లక్షణాలు జట్టును ఉత్తేజపరుస్తాయని నమ్ముతున్నా.’ అని తెలిపారు.
షకీబ్(Shakib Al Hasan) ఇప్పటికే టెస్టు, టీ20 జట్లకు నాయకత్వం వహిస్తున్నాడు. తిరిగి వన్డే సారథిగా నియామకం అవడంతో బంగ్లాను మూడు ఫార్మాట్లలో నడిపించబోతున్నాడు. గతంలో 2009-17 మధ్య 52 వన్డేల్లో అతను బంగ్లా వన్డే జట్టును నడిపించాడు. గతంలో 2010 ఆసియా కప్, 2011 వరల్డ్ కప్ వంటి మెగా ఈవెంట్లలో జట్టును నడిపించిన అనుభవం షకీబ్‌కు ఉన్నది. ఆసియా కప్‌తో షకీబ్ వన్డే బాధ్యతలు చేపట్టబోతున్నాడు. ఈ నెల 30 నుంచి ప్రారంభకానున్న ఈ టోర్నీలో.. 31వ తేదీన శ్రీలంకతో తలపడటంతో బంగ్లాదేశ్ ఈవెంట్‌ను ఆరంభించనుంది.