ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy) 2025లో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్.. ఫైనల్‌ను తలపించింది. ఉత్కంఠబరితంగా సాగిన ఈ పోరులో భారత్ విజయం సాధించింది. సెమీఫైనల్‌లో భారత్ చేతిలో ఓడిన తర్వాత ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్(Steve Smith) కీలక నిర్ణయం తీసుకున్నాడు. తాను వన్డేల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. టీ20, టెస్ట్‌లలో కొనసాగుతానని చెప్పాడు. కాగా స్టీవ్ తీసుకున్న రిటైర్మెంట్ నిర్ణయం ప్రస్తుతం సంచలనం సృష్టించింది. భారత్ చేతిలో ఓటమి తట్టుకోలేకే స్టీవ్ ఈ నిర్ణయం తీసుకున్నాడా? అన్న చర్చ కూడా మొదలైంది.
‘‘వన్డేల్లో ఆడిన ప్రతిక్షణాన్ని ఆస్వాదించా. ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాలు ఉన్నాయి. రెండు వరల్డ్ కప్ టోర్నీల్లో ఆస్ట్రేలియా జట్టులో సభ్యుడిగా ఉన్నాను. ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నాను. 2027 వన్డే ప్రపంచకప్‌కు జట్టును సిద్ధం చేయడానికి ఆస్ట్రేలియాకు(Australia) సరిపడా సమయం దక్కుతుంది. ఇంకా టెస్ట్ క్రికెట్ ఆడగలనని అనుకుంటున్నా’’ అని చెప్పాడీ 35ఏళ్ల ఆటగాడు.
35 ఏళ్ల స్టీవ్ స్మిత్ 170 వన్డేలు ఆడి, 43.28 సగటుతో 5800 పరుగులు, 86.96 స్ట్రైక్ రేట్ సాధించాడు. వాటిలో 12 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో ఆస్ట్రేలియా తరఫున అత్యధిక పరుగులు చేసిన 12వ ఆటగాడిగా స్టీవ్(Steve Smith) తన కెరీర్ ను ముగించాడు. లెగ్ స్పిన్నింగ్ ఆల్ రౌండర్‌గా అరంగేట్రం చేసిన అతను 28 వికెట్లు కూడా తీశాడు. అలాగే 90 క్యాచ్ లు పట్టుకున్నాడు. 2015, 2023లో ఆస్ట్రేలియా వన్డే ప్రపంచ కప్ గెలిచిన జట్టులో స్మిత్ కూడా ఉన్నాడు. మైఖేల్ క్లార్క్ పదవీ విరమణ తర్వాత 50 ఓవర్ల జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాడు. అతను 64 మ్యాచ్‌లకు ఆస్ట్రేలియాకు నాయకత్వం వహించగా 32 మ్యాచ్‌లలో విజయం సాధించాడు. గాయపడిన పాట్ కమ్మిన్స్ లేకపోవడంతో ఛాంపియన్స్ ట్రోఫీకి తాత్కాలిక ప్రాతిపదికన కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకారం, సెమీఫైనల్ ఓటమి తర్వాత స్మిత్ తన సహచరులకు వన్డేల నుంచి వెంటనే రిటైర్ అవుతున్నట్లు చెప్పాడు.