Supreme court dissolves Hyderabad cricket council: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కమిటీ విషయంలో సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. హెచ్‌సీఏ కమిటీని రద్దు చేస్తూ అత్యున్నత న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత కమిటీ స్థానంలో సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ లావు నాగేశ్వరావుతో ఏకసభ్య కమిటీని నియమించినట్లు వెల్లడించింది. ఇకపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు సంబంధించిన అన్ని నిర్ణయాలు తదుపరి చర్యలన్నీ నాగేశ్వరావే చూసుకుంటారని కోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ నాగేశ్వరావు కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి ఆదేశాలు ఇస్తామని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది.
ఇదిలావుండగా.. హెచ్‌సీఏ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్(Mohammad Azharuddin) ప్రస్తుతం తిరుగుబాటును ఎదుర్కొంటున్నారు. మెజారిటీ సభ్యులు కొత్త ఆఫీస్ బేరర్లను ఎన్నుకోవడానికి ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే దీనిని అజార్ తిరస్కరిస్తున్నారు. ఈ క్రమంలో హెచ్‌సీఏ(Hyderabad cricket council)ని పర్యవేక్షించడానికి సుప్రీంకోర్ట్ నియమించిన సూపర్ వైజరీ కమిటీ గత నెలలో ఒక నివేదికను సర్వోన్నత న్యాయస్థానం ముందు వుంచింది. ఈ సందర్భంగా హెచ్‌సీఏ సభ్యత్వాలపై విస్మయకర వాస్తవాలను ఈ నివేదిక వెల్లడించింది. ఈ మేరకు విచారణ జరిపిన సుప్రీం తుది తీర్పును మంగళవారం వెల్లడించింది.