రోహిత్, కోహ్లీ, పంత్, హార్దిక్ పాండ్య, బుమ్రా లేని జట్టును ఊహించడం కష్టం. కానీ వెస్టిండీస్ తో జరగబోయే వన్డే మ్యాచ్ లో వీరు లేకుండానే పోరుకు సిద్ధమైంది ధావన్ సేన. ఇంగ్లాండ్ తో జరిగిన టీ20, వన్డే సిరీస్ గెలిచి ఊపు మీదున్నారు ఆటగాళ్లు. ఇప్పుడు ఇదే ఫామ్ ను కొనసాగించాలని ఆటగాళ్లు తహతహలాడుతున్నారు.
వెస్టిండీస్‌తో 3 మ్యాచ్ ల వన్డే సిరీస్ పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో శుక్రవారం జరిగే తొలి మ్యాచ్‌తో ప్రారంభం కానుంది. విండీస్ జట్టు అంటేనే బిగ్ హిట్టర్స్ కు కొదవ ఉండదు. వారి స్కోర్ లో బౌండరీలే అధికం. ఏ ఇద్దరు ఆటగాళ్లు నిలదొక్కుకున్న భారీ స్కోర్ ఖాయం. కెప్టెన్ రోహిత్‌శర్మ గైర్హాజరీలో ధావన్‌తో కలిసి శుభమన్ గిల్.. భారత ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశముంది.
వన్‌డౌన్‌లో దీపక్ హూడా రానుండగా నాలుగోస్థానంలో సూర్యకుమార్ యాదవ్ ఆడనున్నాడు. ఐదోస్థానం కోసం శ్రేయస్ అయ్యర్, సంజు శాంసన్ మధ్య పోటీనెలకొంది. హార్డిక్ పాండ్యా స్థానంలో శార్దుల్ ఠాకూర్ ఆల్‌రౌండర్ స్థానాన్ని భర్తీ చేయనున్నాడు. రవీంద్ర జడేజా, యజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్‌లతో స్పిన్ విభాగం బలంగా ఉంది. మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణలకు తుదిజట్టులో చోటు ఖాయం కాగా ఆర్షదీప్‌సింగ్ వన్డేల్లో అరంగేట్రం చేయడం ఖాయంగా కనిపిస్తోంది.