క్రికెట్ అభిమానులకు ఐపీఎల్(IPL) నిర్వాహకులు శుభవార్త అందించారు. ఇప్పటికే తొలి విడతలో 21 మ్యాచ్‌లకు మాత్రమే షెడ్యూల్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా పూర్తి షెడ్యూల్‌ను ప్రకటించారు. దేశంలో లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా రెండో విడతను విదేశాల్లో నిర్వహిస్తారనే ప్రచారం జరిగింది. అయితే భారత్‌లోనే నిర్వహించేందుకు నిర్వాహకులు మొగ్గు చూపారు. తాజా షెడ్యూల్‌తో టోర్నీలో మొత్తం 74 మ్యాచ్‌లు జరగనున్నాయి.
మే 26న చెన్నై వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అలాగే మే 24న క్వాలిఫైర్ 2 మ్యాచ్ చెన్నైలోనే నిర్వహించనునక్నారు. ఇక మే 21న క్వాలిఫైయర్ 1, మే22న ఎలిమినేటర్ మ్యాచ్‌లు అహ్మదాబాద్‌లో జరగనున్నాయి. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 9 మ్యాచ్‌లు జరగనున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ తన హోంగ్రౌండ్ ఉప్పల్‌లో 6 మ్యాచ్‌లు ఆడనుండగా… ఢిల్లీ క్యాపిటల్స్ తన రెండో హౌంగ్రౌండ్‌గా వైజాగ్‌ను ఎంచుకోవడంతో మార్చి 31, ఏప్రిల్ 3న వైజాగ్‌లో మ్యాచ్‌లు ఆడనుందిత. మొత్తంగా మార్చి 22 నుంచి మే 26 వరకు దాదాపు 65 రోజుల పాటు అభిమానులను ఐపీఎల్ అలరించనుంది.
ఈసారి ఐపీఎల్(IPL) జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-ఏలో ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఉండగా.. గ్రూప్-బిలో చెన్నై, హైదరాబాద్, బెంగళూరుతోపాటు పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు ఉన్నాయి. గ్రూప్ దశలో.. ఒక గ్రూప్‌లోని జట్లు తమ గ్రూపులోని జట్లతో ఒకసారి తలపడితే.. వేరే గ్రూపులోని జట్లతో రెండుసార్లు చొప్పున తలపడతాయి. గ్రూప్ దశలో టాప్-4లో నిలిచిన జట్లు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తాయి.