క్రికెట్ గాడ్ సచిన్‌ను మించిన ఆటగాడిగా పేరొందిన భారత క్రికెటర్ వినోద్ కాంబ్లే(Vinod Kambli). ఆయన బ్యాట్ పట్టుకుని మైదానంలో వస్తున్నాడంటే బౌలర్ల గుండెల్లో గుబులు మొదలవుతుందని అనేవారు. అలాంటి గ్రేట్ క్రికెటర్ ప్రస్తుత పరిస్థితి చూస్తే ఎవరైనా జాలి పడాల్సిందే. ఆఖరికి తనంతటతానుగా నడవను కూడా నడవలేని స్థితిలో ఉన్నారు వినోద్ కాంబ్లే. గతంలో ఎన్నోసార్లు తన ఆరోగ్యం తీవ్రంగా క్షీణించిందని, ఆర్థిక సహాయం చేయాలని కూడా వినోద్ కోరారు. తాజాగా ఆయన ఆరోగ్య స్థితి మరింత దిగజారింది. ఇతరులు చేయి అందిస్తే కాని ముందుకు అడుగు వేయలేకున్నారు. ఇందుకు ఆయనకున్న క్రమశిక్షణారాహిత్యమేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
క్రమశిక్షణ లేకుంటే ఎంత ప్రతిభ ఉన్నా అది బూడిదలో పోసిన పన్నీరే అవుతుందని కాంబ్లే జీవితం నిరూపిస్తోందని కొందరు అంటున్నారు. తన ప్రతిభకు వచ్చిన స్టార్‌డమ్‌తో విర్రవీగిన కాంబ్లే తీవ్రంగా వ్యసనాలు, విలాసాలకు బానిసై కెరీర్‌ను చేచేతులారా చెడగొట్టుకున్నారని పలువురు క్రికెట్ విశ్లేషకులు చెప్తున్నారు. వినోద్ జీవితం యువతకు ఒక గుణపాఠం కావాలని, ఏ రంగంలోనైనా క్రమశిక్షణ చాలా ముఖ్యమని వారు గ్రహించాలని విశ్లేషకులు చెప్తున్నారు.