ఇస్రో ఖాతాలో మరో విజయం దక్కింది. శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి ఇస్రో చేపట్టిన ఇన్ శాట్-3డీఎస్ ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6.35 గంటలకు జీఎస్ఎల్వీ-ఎఫ్14 రాకెట్ ఈ ఉపగ్రహాన్ని రోదసిలోకి మోసుకెళ్లింది. తొలి రెండు దశలు విజయవంతం అయ్యాక క్రయోజనిక్ దశ కూడా సక్సెస్ అయింది. ఈ క్రమంలోనే పలు ప్రక్రియల ద్వారా శాస్త్రవేత్తలు ఇన్ శాట్-3డీఎస్ ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి చేర్చారు.
అన్ని దశలు సజావుగా పూర్తి కావడంతో ప్రయోగం విజయవంతమైందని ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ ప్రకటించారు. ఇస్రో శాస్త్రవేత్తలు, సిబ్బందికి అభినందనలు చెప్పారు. పే లోడ్‌లు తయారుచేసిన శాస్త్రవేత్తలకు కూడా ప్రత్యేక అభినందనలు తెలిఆపారు. భూ, సముద్ర ఉపరితల వాతావరణంపై పరిశీలన కోసం ఈ ఉపగ్రహం సేవలను వినియోగించుకోనున్నారు. విపత్తులపై ముందే శాస్త్రవేత్తలకు హెచ్చరికలు చేయనుంది.