గత ప్రభుత్వం చేతకాని తనం వల్ల తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) పేర్కొన్నారు. రాష్ట్రాన్ని పదేళ్లు పాలించిన బీఆర్ఎస్.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయడానికి ఏమీ చేయలేదని, తన వ్యక్తిగత లబ్ది కోసమే పనిచేసిందంటూ విమర్శలు గుప్పించారు.
‘‘నిధుల విషయానికి వస్తే, గత ప్రభుత్వ కాలంలో ఆదాయం ద్వారా గాని, అప్పుల ద్వారా గాని, తదితర మార్గాల ద్వారా గాని సమకూరిన నిధుల వ్యయానికీ, రాష్ట్ర పురోగతికీ ఏమాత్రం పొంతన లేని పరిస్థితి నెలకొంది. ఒక ప్రక్క అప్పులు పెరగడంతో పాటు వేరొక ప్రక్క బిల్లుల బకాయిలు భారీగా పేరుకుపోవడం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రమాద స్థాయికి చేరుకుంది.
ప్రణాళికాబద్ధంగా నడపవలసిన రాష్ట్ర ఆర్థికవ్యవస్థను ఒంటెద్దుపోకడలతో స్వంత జాగీరులా ఆర్థిక క్రమశిక్షణ ఏ మాత్రం పాటించక గత ప్రభుత్వం చేసిన తప్పిదాల పర్యవసానం మేము వారసత్వంగా అందుకున్నాము. రాష్ట్ర విభజన నాటికి ఎంతో సమృద్ధిగా, ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్న రాష్ట్రం, నేడు అప్పుల కుప్పగా మారడం విచారకరం. కనీసం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల చెల్లింపులకు, పెన్షన్ చెల్లింపులకు కటకటలాడి సరైన కాలంలో చెల్లించకపోవడం వారి ఆర్థిక క్రమశిక్షణారాహిత్యానికి, ప్రజాసంక్షేమంపై నిర్లక్ష్యానికి మచ్చుతునక మాత్రమే. ఇటువంటి నిర్లక్ష్య వైఖరి వలన అటు ఉద్యోగులు, పెన్షనర్లు మాత్రమే కాక, సామాన్య ప్రజలు, ప్రభుత్వ పథకాలపై ఆధారపడిన అభాగ్యులు, పేద ప్రజలు చెప్పుకోలేని కష్టాలు పడ్డారు’’ అని Bhatti Vikramarka చెప్పుకొచ్చారు.