Telangana Budget 2024 |తెలంగాణ ప్రజల నీటి కష్టాలను బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రస్తావించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి పదేళ్లు దాటినా ప్రజల నీటి కష్టాలు మాత్రం అలానే ఉన్నాయని అన్నారు. సాగు నీరు కోసం రైతులు, తాగు నీటి కోసం ప్రజలు అవస్థలు పడుతూనే ఉన్నారని వివరించారు. బీఆర్ఎస్ హయాంలో పలు ప్రాజెక్ట్‌లు నిర్మించినా లాభం లేకుండా పోయిందని, అందుకు బీఆర్ఎస్ చేతకాని తనం, బాధ్యతారాహిత్యంగా తీసుకున్న నిర్ణయాలే కారణమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Telangana Budget 2024 | ‘‘తెలంగాణ వాటాగా వచ్చే నీళ్లను రాష్ట్ర ప్రజల తాగునీరు, సాగునీరు అవసరాలకు వినియోగించాలన్నది ప్రభుత్వ ప్రధాన సంకల్పం. అయితే గత దశాబ్ద కాలంలో పాలకులు తీసుకున్న తప్పుడు విధాన నిర్ణయాల కారణంగానూ, నాణ్యత లేని పనుల కారణంగానూ సాగు నీటి ప్రాజెక్టులు ఆశించిన ఫలితాలను ఇవ్వలేక పోతున్నాయి. నీళ్ళు ఏ కాలువల ద్వారా పారించాలన్న ధ్యేయంతో కాకుండా, అవినీతి సొమ్మును ఏ కాలువల ద్వారా ప్రవహింపచేయాలన్న లక్ష్యంతో గత ప్రభుత్వం పని చేయడం వల్ల రైతుల సాగునీటి సమస్యలు అపరిష్కృతం గానే మిగిలి పోయాయి. పర్యవసానంగా మన నీళ్ళను మనం సమర్థవంతంగా వాడుకోలేని పరిస్థితి దాపురించింది. ఈ పరిస్థితి నుండి బయటపడే విధంగా తగిన దిద్దుబాటు చర్యలను చేపట్టడంతో పాటు మరింత మేలయిన ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలనే కృత నిశ్చయంతో ఈ ప్రభుత్వం ఉంది’’ అని భట్టి వ్యాఖ్యానించారు.