12 leaders including Mulugu Seethakka resigned from TPCC committee posts: టీపీసీసీ కమిటీల నియామకం తెలంగాణ కాంగ్రెస్ లో అగ్గి రాజేసింది. సీనియర్లు వర్సెస్ వలస నేతలు అంటూ రెండుగా చీలింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. కీలక పదవులన్నీ టీడీపీ నుంచి వచ్చినవారికి దక్కాయంటూ కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆగ్రహిస్తున్నారు. కనీసం తమ అభిప్రాయాన్ని తీసుకోకుండా హైకమాండ్ టీడీపీ నుంచి వచ్చిన దాదాపు 50 మంది నేతలకు కమిటీలో అగ్రస్థానం కల్పించిందంటూ మండిపడుతున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ సీనియర్లంతా వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. రేవంత్ కి చెక్ పెట్టేందుకు సీనియర్లంతా ఒక్కటయ్యారు. టీడీపీ కాంగ్రెస్ గా రేవంత్ వర్గాన్ని వేలెత్తి చూపుతూ.. సేవ్ కాంగ్రెస్ అంటూ హస్తం పార్టీలోని సీనియర్లంతా టీపీసీసీ కమిటీలకు వ్యతిరేకంగా ఐక్యతారాగం అందుకున్నారు.
కాగా, టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన 12 మంది నేతలు తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ కి తమ రాజీనామా లేఖలను అందజేశారు. మా వల్లనే పదవులు రాలేదని సీనియర్లు ఆరోపిస్తున్న నేపథ్యంలో రాజీనామా చేస్తున్నామని, పదవులు రాని వారికి ఈ పదవులు ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. కమిటీల నియామకంలో దాదాపు 50 మంది టీడీపీ నేతలు పదవులు వచ్చాయని ఆరోపిస్తున్న సీనియర్ల వ్యాఖ్యలు అవాస్తవమని, కేవలం 12 మందికి మాత్రమే పదవులు దక్కాయని రాజీనామా చేసిన నేతలు చెబుతున్నారు. కాగా రాజీనామా చేసిన వారంతా రేవంత్ వర్గం, టీడీపీ నుంచి వచ్చినవారే కావడం గమనార్హం.
రాజీనామా చేసిన వారిలో ములుగు ఎమ్మెల్యే సీతక్క(Mulugu Seethakka), వేం నరేందర్ రెడ్డి, విజయరమణారావు, కవ్యంపల్లి సత్యనారాయణ, సుభాష్ రెడ్డి, పటేల్ రమేశ్ రెడ్డి, దొమ్మాటి సాంబయ్య, మధుసూధన్ రెడ్డి, వజ్రేశ్ యాదవ్, చారగొండ వెంకటేష్, సత్తు మల్లేశ్, శశికళ యాదవ రెడ్డి ఉన్నారు. ఇదిలా ఉండగా మాణిక్కం ఠాగూర్ సమక్షంలో ఆదివారం సాయంత్రం గాంధీ భవన్ లో జరిగిన పీసీసీ సమావేశానికి అనుకున్నట్టుగానే సీనియర్లు డుమ్మా కొట్టారు. భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మధుయాష్కీ, జగ్గారెడ్డి, దామోదర్ రాజనర్సింహ హాజరు కాలేదు. మాజీ మంత్రులు జానారెడ్డి, సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ తదితరులు మాత్రమే హాజరయ్యారు. టీపీసీసీ కమిటీలో నూతనంగా చోటు దక్కినవారంతా హాజరయ్యారు.
Read Also: ఫుట్‌బాల్ ప్రపంచకప్‌కు భారత్ ఆతిథ్యం ఇస్తుంది – PM Modi