SLBC Tunnel | శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ దగ్గర భారీ ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా టన్నెల్ పైకప్పు కూలిపోయింది. నాగర్‌కర్నూల్(Nagarkurnool) జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట దగ్గర మూడు మీటర్ల మేరా టన్నెల్ పైకప్పు కూలింది. శనివారం ఉదయం 8:30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఎస్‌ఎల్‌బీసీ ఎడమవైపు టన్నెల్ పనులు జరుగుతుండగా సుమారు 14వ కిలోమీటర్ దగ్గర ప్రమాదం చోటుచేసుకుంది. టన్నల్ బోర్ మిషన్‌తో పని జరుగుతున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది.
ఆ సమయంలో టన్నల్‌లో ఏడుగురు కార్మికులు ఉన్నట్లు సమాచారం. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రమాద సమయంలో భారీ శబ్దం రావడంతో చుట్టుపక్క కార్మికులు టన్నల్‌లోకి పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఈ ప్రమాదానికి సంబంధించి సమాచారం అందిన వెంటనే నీటిపారుదల శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు. ఈ ఘటనపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతలు కూడా ఈ ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేశాయి.
సీఎం రేవంత్ కీలక ఆదేశాల
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) వద్ద జరిగిన ప్రమాదం పై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి(Revanth Reddy) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులను అప్రమత్తం చేశారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, అగ్నిమాపక శాఖ, హైడ్రా, ఇరిగేషన్ విభాగం అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు అందించాలని సీఎం ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy), ఇరిగేషన్ సలహాదారు ఆదిత్య నాథ్ దాస్, ఇరిగేషన్ అధికారులు ప్రత్యేక హెలీకాప్టర్ లో ప్రమాదం జరిగిన ప్రాంతానికి బయలుదేరారు.
అంతేకాకుండా ఈ ఘటనపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరా తీశారు. టెక్నికల్ అధికారులు, వర్క్ చేస్తున్న ఏజెన్సీ ప్రతినిధులతో మంత్రి ఫోన్‌లో మాట్లాడారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.
కోమటిరెడ్డి దిగ్భ్రాంతి
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ స్కీంలో భాగంగా శ్రీశైలం నుంచి దేవరకొండ వైపు వెళ్లే టన్నెల్ 14 కిలోమీటర్ ఇన్లేట్ వద్ద (దోమలపెంట దగ్గర) సి పేజ్ ను పూడ్చివేసిన కాంక్రీట్ సెగ్మెంట్ స్లిప్ అవడంవల్ల ప్రమాదం జరిగిందని ఈ సందర్బంగా మంత్రి కోమటిరెడ్డి(Minister Komatireddy) ఒక ప్రకటనలో తెలిపారు. టన్నెల్ వద్ద పైకప్పు కూలి పలువురికి గాయాలైన సమాచారం అందిన వెంటనే సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడి అధికారులను అప్రమత్తం చేసినట్లు తెలిపారు.