పంజాగుట్ట(Panjagutta)లో ఈరోజు ఉదయం ఓ కారు బీభత్సం సృష్టించింది. తనిఖీల కోసం కారును ఆపమన్న హోంగార్డ్ రమేష్‌ను కొంత దూరం ఈడ్చుకెళ్లింది కారు. నగరవ్యాప్తంగా బ్లాక్‌ఫిల్మ్ చెకింగ్ కోసం పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగానే సయ్యద్ మాజుద్ధిన్ నసిర్ నడుపుతున్న కారును కూడా ఆపాలంటూ హోంగార్డు రమేష్ సిగ్నల్ ఇచ్చాడు. కానీ ఆపని సయ్యద్.. కారును అంతే ముందుకు దూకించాడు. కారుతో పాటు హోంగార్డును కూడా కొంత దూరం ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటనంతా అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ ఘటనపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ట్రాఫిక్ పోలీసులను చూసి భయపడే సయ్యద్ అలా చేశాడని పంజాగుట్ట(Panjagutta) ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ ఆంజనేయులు పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. సయ్యద్ కోసం గాలింపు చేపట్టారు. అసలు ఆ కారు ఎవరిది? ఎక్కడి నుంచి వస్తోంది? అందులో ఏముందని డ్రైవర్ అంతలా భయపడ్డాడు? హోంగార్డును ఈడ్చుకెళ్లైనా తప్పించుకోవాలని ఎందుకు అనుకున్నాడు? అన్న అనుమానాలను పోలీసులు వ్యక్తం చేశారు. అన్ని కోణాల్లో ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.