AC Helmets | భాగ్యనగరంలో రోజురోజుకీ వాహనాల రద్దీ పెరిగిపోతోంది. ప్రతిరోజూ సుమారు 80 లక్షల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో ఎయిర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. వాహనాల రద్దీ, కాలుష్యం మధ్యలోనే ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. ఇది వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈ నేపథ్యంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
జంక్షన్స్ లో విధులు నిర్వహించే ట్రాఫిక్ పోలీసుల కోసం ఏసీ హెల్మెట్లు(AC Helmets) ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. వచ్చేది వేసవి కావడంతో సిబ్బందికి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోనున్నారు. ఇప్పటికే హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని నాలుగు జాన్లలో ట్రాఫిక్ పోలీసులు ఏసీ హెల్మెట్లు ధరించి ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. వీటితో ఇబ్బంది ఏమైనా ఉందా? వాటిని ధరించి విధులు నిర్వహించడం సౌకర్యంగా ఉందా లేదా అని పరిశీలించారు. ఇబ్బందులు ఉంటే వాటికి అనుగుణంగా మార్పులు చేర్పులు చేసి అందుబాటులోకి తేవాలని చూస్తున్నారు. కాగా, ఇప్పటికే వేసవిలో ట్రాఫిక్ పోలీసుల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని గతంలో కూలింగ్ గ్లాసెస్, డ్రింకింగ్ వాటర్, గ్లూకోజ్ వంటివి అందిస్తున్నారు. వీటితోపాటు ఈసారి ఏసీ హెల్మెట్లు కూడా ఇవ్వాలని హైదరాబాద్ కమిషనరేట్ ట్రాఫిక్ అధికారులు యోచిస్తున్నారు.