తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న కూల్చివేతలపై ఎంఐఎం అధినేత ఓవైసీ(Asaduddin Owaisi) ఘాటుగా స్పందించారు. పేదల ఇళ్లను ఇష్టానుసారంగా కూల్చాడం సరైన పద్దతి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ అభివృద్ధికి వ్యతిరేకం కాదని, కానీ పేదలకు ఇబ్బంది కలిగిస్తామంటూ ఊరుకోదని ఆయన కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరించారు. ‘‘సెక్రటేరియట్ సహా మరెన్నో ప్రముఖ కట్టడాలు ఎఫ్‌టీఎల్ పరిధిలోనే ఉన్నాయి. వాటితో లేని ఇబ్బంది పేదల ఇళ్లతోనే వస్తుంది. అవి ఉంటే వరదలు వచ్చినా మునగని హైదరాబాద్.. పేదల ఇళ్లు ఉంటే మాత్రం మునిగిపోతుందా? వరదలను తట్టుకోలేదా? పేదలకు సరైన ప్రత్యామ్నాయం చూపిన తర్వాతనే కూల్చివేతలు చేపట్టాలి. మేము అభివృద్ధికి వ్యతిరేకంగా కాదు. పేదలను కష్టపెడతాం, ఇబ్బంది పెడతామంటే సహించం’’ అని ఆయన నిజామాబాద్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగానే టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టి మహేష్ కుమార్ గౌడ్‌కు అభినందనలు తెలిపారు. అదే విధంగా పార్టీ పాలనను ఒకసారి పరిశీలించాలని సూచించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్.. ప్రజా వ్యతిరేక పాలన, పేదలను అణచివేసే పాలనను కొనసాగిస్తోందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పేదలను ఇబ్బంది పెట్టిన ఏ ప్రభుత్వం బాగుపడిన దాఖలాలు లేవని, ఇప్పటికైనా ప్రభుత్వం తన తీరు మార్చుకుంటుందని ఆశిస్తున్నామని ఆయన(Asaduddin Owaisi) చెప్పుకొచ్చారు.