ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నల్లగొండలో సందడి చేశాడు. తన మామ, బీఆర్ఎస్ నేత కంచర్ల చంద్రేశేఖర్ రెడ్డి(Kancharla Chandrasekhar Reddy) నిర్మించిన కంచర్ల కన్వెన్షన్ హాల్ ప్రారంభించాడు. ఉదయం నుంచే బన్నీ రాక కోసం అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. జై బన్నీ నినాదాలతో ఆ ప్రాంగణంతా మార్మోగిపోయింది. పుష్పరాజ్‌కి భారీ గజమాలతో ఘన స్వాగతం పలికారు. దాదాపు 10వేల మందితో ప్రారంభ సభ ఏర్పాటుచేశారు. తన మామగారు చంద్రశేఖర్ రెడ్డి నల్గొండ జిల్లా ప్రజలకు మంచి చేయాలని కన్వెన్షన్ హాల్ కట్టారని అల్లు అర్జున్ తెలిపాడు. అది ఇక్కడి ప్రజలకు ఉపయోగపడుతుందని.. అందుకు తన మామను అభినందిస్తున్నానని పేర్కొన్నాడు. అయితే సీఎం కేసీఆర్ చంద్రశేఖర్ రెడ్డికి టికెట్ ఇస్తే అల్లు అర్జున్ తన మామ కోసం ప్రచారం చేసే అవకాశాలున్నాయి. ఈ ఫంక్షన్ సందర్భంగా అల్లు అర్జున్ ఫ్లెక్సీలతో పాటు, కేటీఆర్ ఫ్లెక్సీలు కూడా భారీగా కట్టారు.
నాగార్జునసాగర్ నియోజక వర్గం నుండి పోటీ చెయ్యడానికి తాను సిద్ధంగా ఉన్నానని చంద్రశేఖర్ రెడ్డి ఇది వరకే ప్రకటించారు. అందుకే తన బలం చూపించుకోవడానికే అల్లు అర్జున్(Allu Arjun)ని పిలిచి ఓపెన్ చేయించారనే టాక్ వినిపిస్తోంది. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల భగత్‌ను కాదని కంచర్లకు టికెట్ వస్తుందా? అని పార్టీ నేతల్లో సందేహాలు ఉన్నాయి. 2014లో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీపట్నం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసిన చంద్రశేఖర్‌రెడ్డి ఓడిపోయారు. అక్కడి రాజకీయ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో సాగర్‌పైన దృష్టి పెట్టారు. ప్రస్తుతం సుమాకర్ దర్శకత్వంలో పుష్ప-2 సినిమాలో బన్నీ నటిస్తున్న సంగతి తెలిసిందే.