Kanti Velugu – Aarogyasri: తెలంగాణ ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. ఈ పథకంలో భాగంగా లబ్దిదారులకు ఉచితంగా కంటి సమస్యలకు సంబంధించిన చికిత్సను అందిస్తారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కళ్ళ డాక్టర్లు లబ్దిదారులకు కంటి పరీక్షలు నిర్వహిస్తారు. కళ్ళు మసకబారిన వారికి కళ్ళ అద్దాలు, మందులు అవసరం ఉన్నవారికి మందులు, ఆపరేషన్ అవసరం ఉన్నవారి ఆపరేషన్ కూడా చేస్తారు. ప్రభుత్వ ఖర్చుతోనే కంటి వ్యాధిగ్రస్తులకు ఉచితంగా ఇవన్నీ నిర్వహిస్తారు. కాగా సీఎం కేసీఆర్ బుధవారం ఖమ్మంలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలందరినీ కంటి పరీక్షలు చేయించుకుని అవసరం అయితే చికిత్స తీసుకోవాలంటూ సీఎం పిలుపునిచ్చారు.
ఈ నేపథ్యంలో మూడు రోజులుగా అన్ని గ్రామాల్లోని పంచాయితీలు, రైతు వేదికలు, కమ్యూనిటీ హాల్స్ లో కంటి వెలుగు శిబిరాలు నిర్వహిస్తున్నారు అధికారులు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియో సామాన్య ప్రజల్ని బెంబేలెత్తిస్తోంది. కంటి వెలుగుకు వెళ్లకపోతే ఆరోగ్యశ్రీ కట్ అంటూ బెదిరిస్తున్న ఓ ఆడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. కంటి సమస్యలు లేకపోయినా గంటల తరబడి క్యూలో నిలబడి పరీక్షలు చేయించుకోవడం వల్ల ప్రతిరోజూ కూలి పనులు చేసుకుని బ్రతికే మాలాంటి వారికి నష్టం కలుగుతుంది అంటూ పేద ప్రజలు వాపోతున్నారు. మరోవైపు కంటి వెలుగుకు వెళ్లకపోతే అభయహస్తం లాంటి ఆరోగ్యశ్రీ ఎక్కడ తొలగిస్తారో అని భయపడుతున్నారు. అయితే ఈ ఆడియో ఎంతవరకు నిజం అనేది తెలియరాలేదు. దీనిపై ప్రభుత్వం, అధికారులు స్పందించాలని, వాస్తవమేంటో చెప్పాలని ప్రజలు కోరుతున్నారు.