మాజీ మంత్రి బాబూ మోహన్(Babu Mohan) ప్రజాశాంతి పార్టీలో చేరారు. ఆయనకు పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్(KA Paul) కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇటీవల ఆయన బీజేపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కొంతమంది నేతలు తనను పొమ్మనకుండా పొగపెడుతున్నారంటూ వాపోయారు. బీజేపీ కోసం చాలా కష్టపడ్డానని.. తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎన్నికల్లో తిరిగి ప్రచారం చేశానని తెలిపారు.
గతేడాది అసెంబ్లీ ఎన్నికల నుంచి తనను దూరం పెడుతూ వస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో వరంగల్ ఎంపీ టికెట్ ఆశించానని.. కానీ సీటు దొరికే పరిస్థితి కనపడటం లేదన్నారు. తన జీవితంలో ఒక్కసారైనా వరంగల్ ఎంపీగా గెలిచి ప్రజలకు సేవ చేస్తానని పేర్కొన్నారు. ఏ పార్టీలో చేరేది త్వరలోనే ప్రకటిస్తానని వెల్లడించారు.
కాగా 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆందోల్ నియోజకవర్గం నుంచి బాబుమోహన్ ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. గత ఎన్నికల్లో ఆందోల్ నియోజకవర్గం నుంచి ఆయన కుమారుడు ఉదయ్ మోహన్‌కు టికెట్ ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించుకుంది. అయితే తమ కుటుంబంలో చిచ్చు పెడుతున్నారంటూ బాబుమోహన్(Babu Mohan) మండిపడ్డారు. దీంతో ఆయనకే టికెట్ కేటాయించారు.