కాంగ్రెస్ పార్టీ తరపున మల్కాజ్‌గిరి ఎంపీ సీటు కోసం సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్(Bandla Ganesh) దరఖాస్తు చేస్తున్నారు. గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్‌లో తన దరఖాస్తును సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి రెండు నెలల పరిపాలన అద్బుతంగా ఉందన్నారు. త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారిటీ సీట్లు గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. తనకు మల్కాజ్‌గిరి(Malkajgiri) ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పించాలని పార్టీ పెద్దలను కోరుతున్నానని వెల్లడించారు. అలాగే మాజీ మంత్రి మల్లారెడ్డి మతిభ్రమించి మాట్లాడుతున్నారని.. ఆయన కాంగ్రెస్‌లోకి వస్తానన్నా పార్టీలో చేర్చుకోమని స్పష్టంచేశారు.
కాగా బండ్ల గణేష్(Bandla Ganesh) 2018లో కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పార్టీ నుంచి బయటకు వచ్చారు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవాలని తన మద్దతు తెలియజేస్తూ వచ్చారు. అధికారంలోకి వచ్చాక కూడా ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలను బలంగా తిప్పికొడుతున్నారు.
కాగా మినీ ఇండియాగా పేరొందిన మల్కాజ్‌గిరి ఎంపీ టికెట్ కోసం ఎక్కువ ఆశావహులు దరఖాస్తు చేసుకుంటున్నారు. మల్కాజ్‌గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్‌రావు(Mynampally Hanumantha Rao), మధుయాష్కీ గౌడ్(Madhu Yashki Goud), తదితర ప్రముఖులు ఈ సీటును ఆశిస్తున్నారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రాతినిథ్యం వహిస్తున్నారు. మరి అధిష్టానం ఎవరికి సీటును కేటాయిస్తుందో వేచి చూడాలి.