బాసర ట్రిపుల్ ఐటీలో(Basara IIIT) తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బాత్రూంలో చున్నీతో ఉరి వేసుకొని ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డి జిల్లా వడ్లపల్లి మండలం గొర్రెకల్ గ్రామానికి చెందిన వడ్ల దీపిక పీయూసీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. మంగళవారం మధ్యాహ్నం వార్షిక పరీక్షలు రాసిన తర్వాత దీపిక బాత్రూంకి వెళ్లింది. అయితే, బాత్రూం నుంచి ఎంతకీ తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన సిబ్బంది వెళ్లి చూడగా.. చున్నీతో ఆత్మహత్య చేసుకుంది. అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిన దీపికను ఆరోగ్య కేంద్రంలో ప్రథమ చికిత్స చేసి బైంసా ఏరియా హాస్పిటల్‌కి తరలించారు. పరీక్షించిన అక్కడి వైద్యులు అప్పటికే దీపిక మృతి చెందినట్లు నిర్ధారించారు.