తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్లు అందిస్తామన్న మాటపై కాంగ్రెస్ నిలబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) తెలిపారు. రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పించే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించామని చెప్పారు. బీసీ రిజర్వేషన్లను చట్టబద్దం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఏది ఏమైనా దీనిని చేసి తీరుతామని అన్నారు.
ఇప్పటికే దీనికి సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, బీసీ రిజర్వేషన్లకు చట్టబద్దతపై ఫుల్ క్లారిటీతో ముందుకు అడుగులు వేస్తున్నామని ఆయన వివరించారు. మార్చి మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయని, వాటిలో బీసీ రిజర్వేషన్లకు(BC Reservations) సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టి, చట్టాన్ని అమలు చేసేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
అదే విధంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అంశంపై పార్లమెంటును ఒప్పించే అంశంపై కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలను కలుపుకుని ఢిల్లీకి వెళ్లి బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించేలా కృషి చేస్తామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుల గణన సర్వేలో 96.9 శాతం మంది ప్రజలు పాల్గొన్నారని, కేవలం 3.1శాతం మంది మాత్రమే సర్వేకు దూరంగా ఉన్నారని చెప్పారు. ఈ క్రమంలోనే రెండో విడత సర్వే ప్రారంభించామని, అందులో ప్రతి ఒక్కరూ పాల్గొని తమ హక్కును వినియోగించుకోవాలని ఆయన(Ponnam Prabhakar) పిలుపునిచ్చారు.