బడ్జెట్ ప్రసంగంలో భాగంగా రైతు రుణమాఫీ(Rythu Runa Mafi)పై ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. రైతు రుణమాఫీ అంటూ ప్రకటించిన ప్రతిసారీ కూడా బీఆర్ఎస్ చేసిందల్లా మోసమేనని మండిపడ్డారు. “ఏదైన పని జరిగే వరకు అది అసాధ్యంగా గోచరిస్తుంది” అని నెల్సన్ మండెలా గారు చెప్పిన ఈ మాటలు కాంగ్రెస్ ప్రభుత్వ రుణమాఫీ హామీకి అక్షరాలా వర్తిస్తాయి. రైతులకు రెండు లక్షల రుణమాఫీ అనేది మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలలో అత్యంత ప్రధానమైనది. ఎంతో సాహసోపేతంగా మా నాయకులు రాహుల్ గాంధీ.. వరంగల్ రైతు డిక్లరేషన్ లో రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. ఈ రుణమాఫీకి అవసరమైన నిధులను ఎలాగైనా సమీకరించాలనే సంకల్ప బలం మాకు మొదటి నుంచి ఉంది. గత ప్రభుత్వం 2014 లో రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని ప్రకటించి, 2014 నుండి 2018 వరకు నాలుగు విడుతల్లో నిధులు విడుదల చేసింది. ఇలా పలు దఫాలలో నిధుల విడుదల వల్ల అసలు తీరకపోవడంతో పాటు రైతులకు వడ్డీ భారం కూడా పెరిగింది’’ అని తెలిపారు.
‘‘రెండవసారి అధికారంలో వచ్చిన తర్వాత కూడా మళ్లీ లక్షరూపాయలు మాఫీ చేస్తామని చెప్పి ఐదు సంవత్సరాల కాలంలో సరిగ్గా ఎన్నికల ముందు కొద్దిపాటి నిధులు విడుదల చేసి చేతులు దులుపుకున్నారు. దీనివల్ల రైతులు తీవ్రంగా నష్ట పోయారు. వడ్డీ భారం పెరిగిపోవడం, పాత బకాయిలు తీరకపోవడం వలన బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వలేదు. వ్యవసాయానికి పెట్టుబడి అందక, రైతులు వడ్డీ వ్యాపారుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి బతకాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇలా అరకొర రుణమాఫీలా కాకుండా రైతుకు నిజమైన మేలు జరగాలనే ఉద్దేశంతో మా ప్రభుత్వం ఒకేసారిగా 31 వేల కోట్ల రుణమాఫీ(Rythu Runa Mafi) చేయాలని సంకల్పించింది’’ అని వెల్లడించారు.