కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఎదుర్కొన్న అతిపెద్ద సవాలు ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడమే అని భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) వివరించారు. అందుకోసం తాము ఎన్నో మార్గాలు అవలంభించామని తెలిపారు. అప్పులు కట్టడానికి కొత్త అప్పులు తీసుకోవాల్సిన దుస్థితిలో రాష్ట్రం ఉన్నప్పుడు తాము పగ్గాలు చేపట్టామని, అలాంటి స్థితిలో కూడా ప్రజలకు అందించే సంక్షేమం విషయంలో రాజీ పడలేదని వివరించారు.
‘‘మా ప్రభుత్వం ఏర్పడేనాటికి కుంటుపడిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం మేము ఎదుర్కున్న పెనుసవాలు. తలకుమించిన రుణభారం ఉన్నప్పటికీ, దుబారా ఖర్చులు కట్టడి చేసి, ఆర్థిక క్రమశిక్షణతో పాలన ప్రారంభించాము. తద్వారా, ఉద్యోగులకు, పెన్షన్ దారులకు సకాలంలో జీతాలు చెల్లించడానికి వెసులుబాటు కలిగింది. ఈ సంవత్సరం మార్చి నెల నుండి 3.69 లక్షల ప్రభుత్వ ఉద్యోగులకు, 2.87 లక్షల పెన్షన్ దారులకు క్రమం తప్పకుండా ప్రతి నెల మొదటి తారీఖున జీతాలు/పెన్షన్లు చెల్లించడానికి మా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉన్నా, సంక్షేమాన్ని మాత్రం మేము విస్మరించలేదు. డిసెంబర్ నుండి నేటి వరకు 34,579 కోట్ల రూపాయలు వివిధ పథకాలపై ఖర్చు చేశాం. ఈ పథకాలలో ముఖ్యమైనవి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత కరెంట్, రైతు భరోసా, బియ్యం పై సబ్సిడీలు మరియు చేయూత. సంక్షేమంతో పాటు మూలధన వ్యయానికి (Capital Expenditure) కూడా అదనంగా 19,456 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పదేళ్ళ తర్వాత వాస్తవానికి దగ్గరగా, ప్రణాళికాబద్ధమైన బడ్జెట్ ను తొలిసారిగా మా ప్రభుత్వం 2024 ఫిబ్రవరి 10న శాసన సభలో ప్రవేశ పెట్టడం జరిగింది’’ అని వివరించారాయన(Bhatti Vikramarka).