Bhatti Vikramarka fires on bjp: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేశంలో స్వేచ్ఛ లేకుండా పోయిందనీ.. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్లు చెప్పిందే మాట్లాడాలనీ.. ప్రచారం చేయాలన్నట్లు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజ్యాంగాన్ని ఆమోదించుకున్న రోజును, రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నామని అన్నారు. సామాజికంగా అందరికీ సమాన హక్కులు రాజ్యాంగం ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో 20 సూత్రాల అమలు, బ్యాంకుల జాతీయకరణ చేసిందని గుర్తు చేశారు.
కానీ బీజేపీ రాజ్యాంగాన్ని మార్చి, మనువాదా శాస్త్రాన్ని అమలు చేయాలని చూస్తుందంటూ దుయ్యబట్టారు. ఆర్థిక సమానత్వం లేకుండా.. ఒక్కరికే కట్టబెడుతున్నారని ఆరోపించారు. బడుగు, బలహీన, బహుజన అవకాశాలు కొల్లగొట్టి, కొందిమందికి బీజేపీ కట్టబెడుతుందన్నారు. ఎనిమిదేళ్ల బీజేపీ పాలనలో మామూలు వ్యాపారవేత్త, ప్రపంచ కుబేరుడిగా మారుతున్నారంటూ విమర్శించారు. ఈడీ, సీబీఐ, ఏసీబీలతో దాడులు చేయిస్తూ.. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారన్నారు. భారత రాజ్యాంగ రక్షణే.. దేశ రక్షణ అని కాంగ్రెస్ మర్చిపోదని భట్టి అన్నారు. రాజకీయ సమానత్వంలో అత్యంత పేదవాడు సైతం ఎన్నికల్లో గెలిచేలా ఉండాలని విక్రమార్క (Bhatti Vikramarka) సూచించారు.