బీఆర్ఎస్ సర్కార్, ముఖ్యమంత్రి కేసీఆర్(KCR)పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో భారీ వర్షాలు వస్తాయని తెలిసినప్పటికీ అధికార యంత్రాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేయలేదని మండిపడ్డారు. దాని కారణంగా పెద్ద ఎత్తున ప్రాణ, పంట, ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు. వర్షాల వల్ల 60 మంది చనిపోవడం గతంలో ఎప్పడూ చూడలేదని ఆవేదన చెందారు.
ప్రజల ధన, మాన, ప్రాణాలు కాపాడాల్సిన యంత్రాంగం నిర్లక్ష్యం వహించడంతో ఇంతటి దారుణం జరిగిందని అన్నారు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన(Bhatti Vikramarka) డిమాండ్ చేశారు. 69 చెరువుల తెగిపోయి వాగులు పొంగి పోవడంతో మొరంచపల్లి ఊరు మునిగిపోయిందని వ్యాఖ్యానించారు. సాంకేతికపరమైన ఆలోచనలతో కాకుండా రాజకీయపరమైన అవసరాల కోసం చెక్ డ్యాంల నిర్మాణం చేశారని ఆరోపించారు. రిటైనింగ్ వాల్స్ కట్టకపోవడం వల్ల భూమి కోత జరిగి కిన్నెరసాని(Kinnerasani) నదిపై నాగారం బ్రిడ్జి వద్ద రెండేళ్ల క్రితం కట్టిన చెక్ డ్యాం కొట్టుకుపోయిందని అన్నారు. రాష్ట్రంలో ఆనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొందని వెల్లడించారు.