భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ లేకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడకపోతుండే అని మంత్రి జగదీశ్ రెడ్డి(Minister Jagadish Reddy) అన్నారు. రాజ్యాంగంలో ఆయన పొందుపరిచిన ఆర్టికల్ 3 వల్లే రాష్ట్రం ఏర్పడిందని తెలిపారు. దేశం కోసం ఆయన సర్వస్వం అర్పించారని కొనియాడారు. అంబేద్కర్ లాంటి మహనీయులు మళ్లీ పుట్టబోరని అన్నారు. భువనగిరి బార్ అసోసియేషన్ న్యాయవాదుల బృందం మంత్రి జగదీష్ రెడ్డిని కలిశారు. అంబేద్కర్ భవన నిర్మాణం పనులు త్వరగా పూర్తయ్యేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు.
దీంతో వెంటనే స్పందించిన మంత్రి(Minister Jagadish Reddy).. పూర్తి చేసేందుకు సత్వర చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అంబేద్కర్ భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 2 కోట్ల 40 లక్షల నిధులు మంజూరు చేసిందని తెలిపారు. భనవ నిర్మాణానికి రూ.2 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేయగా.. మిగిలిన రూ.40 లక్షలతో పాటు అవసరమైన నిధులు మంజూరు చేసి అంబేద్కర్ భవనాన్ని పూర్తి చేయనున్నట్లు ఆయన తెలిపారు. అంబేద్కర్ వల్లే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందన్నారు.