తెలంగాణ బిజెపిలో రోజురోజుకీ అసంతృప్త నేతల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే చంద్రశేఖర్, రవీంద్ర నాయక్ వంటి నాయకులు బయటకు వచ్చారు. తాజాగా భువనగిరి జిల్లా కీలక నేత జిట్టా బాలకృష్ణారెడ్డి(Jitta Balakrishna Reddy) చేసిన కామెంట్స్.. త్వరలో గుడ్ బై చెప్పనున్నారని సంకేతాలు ఇస్తున్నాయి. అంతేకాదు ఆయన హస్తం గూటికి చేరనున్నారనే అనుమానాలు బలంగా వ్యక్తం అవుతున్నాయి. దీంతో ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారాయి.
విభేదాల కారణంగా యాదాద్రి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనిల్ కుమార్ రెడ్డి హస్తానికి హ్యాండిచ్చి, బీఆర్ఎస్ పార్టీలో చేరారు. MP కోమటిరెడ్డి వెకటరెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన ఆయన… కొద్దిసేపటికే గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలో భువనగిరిలో పార్టీపరంగా తీసుకునే చర్యలపై ఫోకస్ పెట్టింది రాష్ట్ర కాంగ్రెస్. అక్కడ బలమైన నేతగా పేరున్న జిట్టా బాలకృష్ణారెడ్డి(Jitta Balakrishna Reddy)ని తమ వైపుకు తిప్పుకునేందుకు దృష్టి సారించింది. ప్రస్తుతం బీజేపీలో ఉన్న జిట్టా… చాలా రోజుల నుండి సైలెంట్ గా ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం లేదు. దీనికితోడు బీజేపీని ఉద్దేశిస్తూ ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన పార్టీ మారటం పక్కా అనే అనిపిస్తోంది.
మంగళవారం మీడియాతో మాట్లాడిన జిట్టా… బీజేపీకి తాను మానసికంగా ఎప్పుడో దూరమయ్యానని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లోకి రావాలంటూ తనకు ఆహ్వానం అందిందని కూడా చెప్పుకొచ్చారు. అనుచరులతో చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరుతాయనే ఆశతోనే బీజేపీలో చేరానన్న ఆయన… తాను కార్యకర్తగా మాత్రమే ఆ పార్టీలో ఉన్నానని తెలిపారు.
బీజేపీలోనే అంతర్గత గ్రూపు రాజకీయాలు ఎక్కువయ్యాయని అన్నారు. బిజెపి, బీఆర్ఎస్ దోస్తీ పై హై కమాండ్ క్లారిటీ ఇవ్వాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. ఇతర పార్టీల్లో ఉన్న నేతలపై కూడా ఆయన ఫైర్ అయ్యారు. ఎంపీ కోమటిరెడ్డిని అనే అంత స్థాయి అనిల్ కుమార్ రెడ్డికి లేదన్నారు. వీటన్నింటిని చూస్తే… జిట్టా బాలకృష్ణారెడ్డి పార్టీ మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. దీనిపై త్వరలోనే అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉంది.