హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో భారీ పేలుడు(Blast) సంభవించింది. ఓ హోటల్(Telangana Spice Kitchen)లో రిఫ్రిజిరేటర్ కంప్రెషర్ పేలి భారీ శబ్దం వచ్చింది. పేలుడు ధాటికి హోటల్ వెనుక భాగంలోని రాతి గోడ నుంచి రాళ్లు ఎగిరిపడ్డాయి. ఈ రాళ్లు దుర్గాభవాని నగర్ బస్తీలోని ఇళ్లపై పడడంతో పలువురికి గాయాలయ్యాయి. ప్రమాదంలో ఐదు ఇల్లు ధ్వంసం అవ్వగా.. ఇద్దరికి గాయాలయ్యాయి.
వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 1లో తెలంగాణ స్పైస్ కిచెన్(Telangana Spice Kitchen) పేరిట ఓ హోటల్ ఉంది. ఆదివారం తెల్లవారుజామున భారీ శబ్దంతో ఫ్రిజ్ కంప్రెషర్ పేలింది. దీంతో హోటల్ ప్రహరీ ధ్వంసమై… 100 మీటర్ల అవతల ఉన్న దుర్గాభవాని నగర్ బస్తీలోని ఇళ్లపై రాళ్ళు ఎగిరిపడ్డాయి. ఐదు గుడిసెలు ధ్వంసమయ్యాయి. కరెంటు స్తంభాలు విరిగిపడ్డాయి. ఇద్దరు గాయాలపాలవగా వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. విషయం తెలుసుకున్న జూబ్లీహిల్స్(Jubilee Hills) పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. డీసీపీ విజయ్ కుమార్, జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి తెలంగాణ స్పైస్ కిచెన్ హోటల్ నిర్వాహకులతో మాట్లాడారు. ఘటనా స్థలాన్ని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పరిశీలించి క్షతగాత్రులను పరామర్శించారు.