ఉద్యమ కాలం నాటి కేసీఆర్‌ను మళ్లీ చూడబోతున్నారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్‌లో జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 17 ఎంపీ నియోజకవర్గాల అభ్యర్థులకు బీ ఫారాలు అందజేశారు. అలాగే ఎన్నికల ఖర్చు నిమిత్తం ఒక్కో అభ్యర్థికి రూ. 95 లక్షల విలువ చేసే చెక్కులను కూడా అందించారు. అనంతరం లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం, అనుసరించే వ్యూహంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థులతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయం గందరగోళం ఏర్పడే అవకాశం ఉందని.. ఏ రాజకీయ గందరగోళం జరిగినా బీఆర్ఎస్‌కే మేలు జరుగుతుందని పేర్కొన్నారు. 104 మంది ఎమ్మెల్యేలున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్నే కూల్చేందుకు బీజేపీ యత్నించిందని.. 64 మంది ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీని బతకనిస్తుందా..? అని కేసీఆర్ పేర్కొన్నారు. రానున్న రోజులు మనవే అని పార్లమెంట్‌లో మన గళం వినిపించాల్సిన అవసరం ఉందని తెలిపారు. కొందరు నేతలు పార్టీని వీడి వెళ్లినంత మాత్రానా బీఆర్ఎస్‌కు నష్టం ఏమీ లేదు అని కేసీఆర్(KCR) స్పష్టం చేశారు.
అలాగే తొలిసారి ఆయన కుమార్తె బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) అరెస్ట్‌పై స్పందించారు. లిక్కర్ కేసు అంతా ఉత్తిదే అని.. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ నేత బీఎల్ సంతోష్‌ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించినందుకు మనపై ప్రధాని మోదీ కక్ష కట్టారని ఆరోపించారు. అందుకే ఈ కేసులో కవితను అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీ దుర్మార్గుడు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.