ఆటో డ్రైవర్ల(Auto Drivers) సమస్యలపై బీఆర్ఎస్ నేతలు ఈరోజు అసెంబ్లీలో నిరసన చేపట్టారు. ఖాకీ చొక్కాలు వేసుకుని వచ్చిన బీఆర్ఎస్(BRS) నేతలు.. కాంగ్రెస్ పాలనలో ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. ఉచిత బస్సు ప్రయాణ పథకంతో ఉపాధిని కోల్పోయిన ఆటో డ్రైవర్లను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, ఎన్నికల సమయంలో వారికి ఇచ్చిన హామీని కూడా ఏడాది కావొస్తున్నా అమలు చేయలేదని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ చేసిన ఆరోపణలపై మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) స్పందించారు. ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీ ప్రకారం ఈ ఏడాది రూ.12వేల ఇవ్వని మాట వాస్తవమేనని, అందుకు కొన్ని బలమైన కారణాలు ఉన్నాయని వివరణ ఇచ్చారు.
‘‘ఆటో కార్మికులపై బీఆర్ఎస్ మొసలి కన్నీరు కారుస్తుంది. ఆటో కార్మికులపై మీకు చిత్తశుద్ధి ఉంటే మీ ప్రభుత్వం ఉన్న 10 సంవత్సరాల్లో వారి సంక్షేమం కోసం తీసుకున్న చర్యలు ఏంటో చెప్పాలి. మెట్రో వస్తే ఇతర వాటిపై ప్రభావం పడిందని, మహిళలకు ఉచిత ప్రయాణం ఇస్తే ఆటోలపై ప్రభావం పడిందని ఆరోపణ తప్పు. బస్సులు.. ప్రయాణికుల ఇంటికి వెళ్లడం లేదు. గతంలో లాగానే బస్సు స్టాండ్ నుండి పోతుంది. ప్రజలు ఇంటి దగ్గర నుండి బస్సు స్టాండ్‌కి వెళ్ళడానికి ఆటోలను వాడుతున్నారు. ఎన్నికలలో ఆటో కార్మికులకు రూ.12 వేలు సంవత్సరానికి ఇస్తామని అన్నాం.
బీఆర్ఎస్ నిర్వాకం వల్ల ఆర్థిక సంక్షోభం(Financial Crisis) ఏర్పడటంతో ఈ సంవత్సరం ఇవ్వలేకపోయాం. భవిష్యత్‌లో ఆటో కార్మికులను ఆదుకునే బాధ్యత మా ప్రభుత్వానికి ఉంది. ఆటో కార్మికులు వేసుకునే డ్రెస్‌లు వేసుకోవడం, నిన్న బేడీలు వేసుకొని వేషాలు వేయడం రాజకీయ డ్రామాలు. అటువంటివి చేయకండి. మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే ఏనాడయినా రవాణా శాఖ మంత్రికి ఆటో కార్మికుల సమస్యలపై రీప్రజెంటేషన్ చేశారా? రాజకీయాల కోసం నిరసనలు చెపట్టడం సరికాదు. ప్రజాస్వామికంగా ఆటో కార్మికులను తీసుకుని రండి ఆటో కార్మికుల సమస్యలపై చర్చిద్దాం’’ అని పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) చెప్పారు.