ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై అమెరికన్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేయడంపై తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్(KTR) ఘాటుగా స్పందించారు. విద్యుత్ ఒప్పందాల కోసం భారత్‌లోని వివిధ రాష్ట్రాల అధికారులకు సుమారు రూ.2,100 కోట్ల లంచాల ఇవ్వజూపారు అన్న అరోపణల మీద ఒక అమెరికన్ కోర్టు గౌతం అదానీకి అరెస్ట్ వారెంట్ జారీ చేసిందని తెలిపారు. ఇటువంటి ఫ్రాడ్ కంపెనీలను కేసీఆర్ ఏనాడూ దగ్గరికి రానివ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్లే తెలంగాణలో దాదాపు రూ.12,400 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమయ్యారని చెప్పారు.
ఈ పెట్టుబడులు వెనక ఎంత ఇచ్చారో? అన్న అనుమానాలను వ్యక్తం చేశారు. తెంగాణలో అదానీ పెట్టనున్న పెట్టుబడుల వివరాలను కూడా కేటీఆర్ తన ఎక్స్ ఖాతా వేదికగా షేర్ చేసుకున్నారు. ఈ సందర్భంగానే కాంగ్రెస్, బీజేపీతో అదానికి ఉన్న అనుబంధం దేశానికి అవమానమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, అదానీ మధ్య ఉన్న చీకటి ఒప్పందాలు వెలుగు చూడాలని డిమాండ్ చేశారు.
‘‘కాంగ్రెస్ ప్రభుత్వం హాయంలో తెలంగాణలో భారీగా పెట్టబడులు పెట్టడానికి అదానీ(Adani) ఆసక్తి చూపారని, దాదాపు రూ.12,400 కోట్లు తెలంగాణలో వెచ్చించడానికి అదానీ ఓకే చెప్పారని గుర్తు చేశారు. అదానీ గ్రీన్ ఎనర్జీ కోసం రూ.5వేల కోట్లు, అదాని కనెక్స్ డాటా సెంటర్స్‌కు రూ.5వేల కోట్లు, అంబుజా సిమెంట్స్‌కు రూ.1,400 కోట్లు, అదానీ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్‌కు రూ.1వెయ్యి కోట్లు వెచ్చించడానికి అదానీ ఓకే చెప్పారు.
వీటన్నింటికి సంబంధించి కూడా వరల్డ్ ఎకనామిక్ ఫారమ్ దావోస్ వేదికగా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఆ సమయంలో రేవంత్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన తెలంగాణ స్కిల్ యూనివర్సిటీకి కూడా తాను సహాయం చేస్తానని అదానీ చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం ఇటీవల సీఎం రేవంత్‌కు అదానీ రూ.100 కోట్లు ఇచ్చారు. ప్రస్తుతం అమెరికా కోర్టు చేసిన సంచలన ఆరోపణల మధ్య నాదో సందేహం. అప్పుడు సీఎం రేవంత్(Revanth Reddy)కు అదానీ ఇచ్చి ఆ రూ.100 కోట్లు బహుమతా? లేదా లంచమా?’’ అని కేటీఆర్(KTR) ప్రశ్నించారు.