తెలంగాణలో ఎన్నికల సందడి మొదలైంది. ఎమ్మెల్యే ఆశావహులు విస్తృతంగా పార్టీలు మారుతున్నారు. ఈ క్రమంలో అధికార బీఆర్ఎస్(BRS) నేతలు ఎప్పుడెప్పుడు అభ్యర్థులు ప్రకటిస్తుందా? అని ఎదురుచూస్తున్న నేతలకు బీఆర్ఎస్ అధిష్టానం కీలక సూచనలు చేసింది. అభ్యర్థుల తొలి జాబితాను(BRS MLA Candidates) బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ నెల 21న తెలంగాణ భవన్‌లో లాంఛనంగా విడుదల చేయనున్నట్లు పార్టీ వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి.
ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా, శ్రావణ పంచమి మంచి ముహూర్తం కావడంతో సోమవారం సాయంత్రం ప్రకటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. దానికి తగిన కసరత్తు కూడా దాదాపు పూర్తయిందని తెలిపాయి. వివాదాస్పదంగా ఉన్న కొన్ని స్థానాలు మినహా దాదాపు వందకు పైగా అభ్యర్థులను(BRS MLA Candidates) ప్రకటించవచ్చని సూచనప్రాయంగా తెలిపాయి. కేసీఆర్(KCR) లక్కీ నెంబర్ ఆరు కావడంతో 105 మంది పేర్లను ప్రకటించవచ్చని అంచనా వేస్తున్నారు.