తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి, BRS ముఖ్య నేత హరీష్ రావు(Harish Rao) సీఎం రేవంత్ రెడ్డిని కలవడం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. శుక్రవారం ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ తో పాటు రేవంత్ రెడ్డిని అసెంబ్లీలోని ఆయన చాంబర్‌లో కలిశారు. దాదాపు 30 నిమిషాలకు పైగా భేటీ అవడం అందరిలో అనుమానాన్ని రేకెత్తించింది. ఉదయం అసెంబ్లీలో ముఖ్యమంత్రిని విమర్శించిన హరీష్ రావు, అసెంబ్లీ సమావేశం నుండి బయటకు వచ్చిన తర్వాత పద్మరావుతో(Padma Rao Goud) కలిసి సీఎంతో భేటీ అవడం చర్చనీయాంశం అయింది.
అయితే, పద్మారావు ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ లోని ప్రాజెక్టులకు నిధులు విడుదల చేయాలని కోరడానికి సీఎంని కలిసేందుకు వెళ్లినట్లు హరీష్ రావు(Harish Rao) స్పష్టం చేశారు. సీతాఫల్మండిలో(Sitaphalmandi) ఒకే చోట ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయడానికి BRS పాలనలో రూ.32 కోట్లు శాంక్షన్ చేశారని ఆయన అన్నారు. అయితే, ఎన్నికల కోడ్ కారణంగా నిధులు ఆగిపోయాయి. దీంతో నిధులు విడుదల చేయాలని అడగటానికి ముఖ్యమంత్రిని కలిసేందుకు పద్మారావు గౌడ్ తనతో పాటు రావాలని కోరారని చెప్పారు. కానీ తాము వెళ్లేసరికి రూమ్ నిండా మంది ఉన్నారని, అందుకే ఆ పేపర్లను వేం నరేందర్ రెడ్డికి ఆ పేపర్ ఇచ్చి వచ్చేశామని అన్నారు. ఈ సమావేశం గురించి పెద్దగా మాట్లాడటానికి ఏమీ లేదని ఆయన అన్నారు.