బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని(Jagadish Reddy) సస్పెండ్ చేశారు. ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Gaddam Prasad Kumar) ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగిసేవరకు ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈరోజు జరిగిన సమావేశాల్లో తనను ఉద్దేశించిన చేసిన వ్యాఖ్యలకు గానూ ఆయనను సస్పెండ్ చేశారు స్పీకర్. బడ్జెట్ సమావేశాలు ముగిసేవరకు జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయాలని మంత్రి శ్రీధర్ బాబు ప్రతిపాదించారు. ఆయన ప్రతిపాదనకు స్పీకర్ ఆమోదం తెలిపారు.
తెలంగాణ అసెంబ్లీలో Jagadish Reddy దుమారం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్‌ను ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. జగదీష్ రెడ్డి తాను చేసిన ప్రతి పదాన్ని వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ‘‘ఈ సభ అందరిదీ. సభ్యులందరికీ సభలో సమాన హక్కులు ఉన్నాయి. మా అందరి తరుపున పెద్దమనిషిగా స్పీకర్ స్థానంలో మీరు కూర్చున్నారు. అంతే తప్ప ఈ సభ మీకు కూడా ఏమీ సొంతం కాదు’’ అని జగదీష్ రెడ్డి అన్నారు. ఆయన మాటలతో సభలో తీవ్ర దుమారం రేగింది. కాంగ్రెస్ నేతలంతా ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. జగదీష్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని, చెయిర్‌ను అవమానించేలా మాట్లాడటం దారుణమని అన్నారు. స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంశాన్ని అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ దృష్టికి తీసుకెళ్లాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు.
నిరసన బాట పట్టిన బీఆర్ఎస్
బడ్జెట్ సమావేశాల వరకు తమ పార్టీ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయడాన్ని బీఆర్ఎస్ నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన తెలుపుతున్నారు. ప్రతిపక్ష నేతల విషయంలో పక్షపాతం చూపుతున్నారని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు.