బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. ఎమ్మెల్యే లాస్య నందిత(Lasya Nanditha) కన్నుమూశారు. ORR పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె మృతి చెందారు. పటాన్ చెరువు సమీపంలో కారు డివైడర్ ని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఎమ్మెల్యే అక్కడికక్కడే మృతి చెందగా.. డ్రైవర్ కి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం డ్రైవర్ ని మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈరోజు తెల్లవారుజామున సంఘటన చోటు చేసుకుంది. అటుగా వెళ్తున్న ప్రయాణికులు పోలీసులకు, అంబులెన్సుకి సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిద్రమత్తు, అతివేగం కారణంగానే ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
గత ఏడాది ఫిబ్రవరిలో తండ్రి ఎమ్మెల్యే సాయన్న మృతి చెందిన విషయం తెలిసిందే. ఏడాది తర్వాత అదే నెలలో లాస్య మృతి చెందడం కుటుంబ సభ్యులను కలచివేస్తోంది. అటు పార్టీ శ్రేణులు, అభిమానులు ఈ విషాద ఘటనపై విచారం వ్యక్తం చేస్తున్నారు. కాగా, నవంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో లాస్య నందిత సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి పోటీ చేసి గెలిచారు. సాయన్న అకాల మరణంతో BRS అధిష్టానం కంటోన్మెంట్ టికెట్ ని లాస్య నందితకి కేటాయించింది. గతంలో ఆమె కవాడిగూడ కార్పొరేటర్ గా బాధ్యతలు నిర్వర్తించారు.
అయితే ఈ నెల 13 న కూడా లాస్య నందిత కారు ప్రమాదానికి గురైంది. కేసీఆర్ నిర్వహించిన నల్గొండ సభకి హాజరై తిరిగి వస్తున్న సమయంలో ఆమె కారుకి యాక్సిడెంట్ అయింది. ఆ ప్రమాదంలో హోమ్ గార్డ్ మృతి చెందారు. కారు నుజ్జు నుజ్జు అయింది. అయినప్పటికీ లాస్య నందిత(Lasya Nanditha) తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు. కానీ పది రోజులు గడవకుండానే మరో కారు ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. సాయన్న మృతితో అలుముకున్న విషాదం నుండి కుటుంబ సభ్యులు కోలుకునేలోపే చిన్న వయస్సులోనే కూతురు కూడా మరణించడం కుటుంబ సభ్యులకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది. కంటోన్మెంట్ నియోజకవర్గంలోనూ విషాదఛాయలు అలుముకున్నాయి.