సీఎం రేవంత్ రెడ్డి తాను మంచి మిత్రులమంటూ మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి(Malla Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణస్వీకారం సందర్భంగా అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మల్లారెడ్డి చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రేవంత్, తాను గతంలో తెలుగుదేశం పార్టీలో కలిసి పనిచేశామని.. అక్కడే రాజకీయాలు నేర్చుకున్నామని తెలిపారు. త్వరలోనే సీఎం రేవంత్(Revanth Reddy)ను కలిసి కీసర ఆలయం కార్యక్రమానికి ఆహ్వానిస్తానని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని రిటైర్మెంట్ తీసుకుంటానని స్పష్టంచేశారు.
ఇదిలా ఉంటే అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి, మల్లారెడ్డి ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. మల్లన్న అయితే రేవంత్‌ని బూతులు తిడుతూ తొడగొట్టి మరీ సవాల్ విసిరారు. అయితే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ ముఖ్యమంత్రి కావడంతో మల్లారెడ్డి(Malla Reddy) సైలెంట్ అయిపోయారు. ఇదే సందర్భంలో మేడ్చల్ జిల్లాలో గిరిజనుల భూములు కబ్జా చేశారని మల్లన్నపై పోలీస్ కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి తన పాత మిత్రుడు అంటూ ఆయన వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశముందని జోరుగా ప్రచారం జరుగుతోంది.