కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్(Danam Nagender)పై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Gaddam Prasad Kumar)కు ఫిర్యాదుచేశారు. అనంతరం హుజురాబాద్ ఎమ్మెల్యే పాడె కౌశిక్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.
“బీఆర్ఎస్‌లో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన దానం నాగేందర్‌పై చర్యలు తీసుకోవాలి. స్పీకర్ సైతం కచ్చితంగా పరిశీలిస్తాం, యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుతం సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి గతంలో ఒక పార్టీలో గెలిచి మరొక పార్టీలోకి వెళ్లిన వారిని రాళ్లతో కొట్టి చంపాలి అన్నారు. మరి ఈరోజు రాళ్ల తోటి కొట్టి చంపుతారా..? నేను అడుగుతున్నాను. తెలంగాణ ప్రజలకు ఏమని సమాధానం చెబుతారు? పంజాగుట్ట బార్ దగ్గర బీడీలు అమ్ముకుంటాడని విమర్శలు చేసి ఇప్పుడు ఎందుకు తీసుకున్నారు? దానం నాగేందర్ చేరిక సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) బాగా నవ్వుతున్నారు. మీరు కొట్టారు మేము తీసుకున్నాము. మేము కొట్టినప్పుడు మీకు లేవకుండా పోతావ్. సింహం ఒక అడుగు వెనక్కి వేసిందంటే.. తిరిగి నాలుగు అడుగులు ముందుకు దూసుకు వస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి” అన్నారు.
కాగా ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్(Danam Nagender) కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఏఐసీసీ ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.