సుదీర్ఘ చర్చల అనంతరం వరంగల్ ఎంపీ అభ్యర్థిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఉద్యమకారుడు, మాదిగ సామాజిక వర్గానికి చెందిన మారేపల్లి సుధీర్ కుమార్(Marepalli Sudhir Kumar)ను ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేశారు. 2001లో పార్టీ ఆవిర్భావం నుంచి విధేయుడిగా పనిచేస్తున్న సుధీర్ కుమార్ సరైన అభ్యర్థి అని ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ ముఖ్యనేతలు పేర్కొన్నారు. దీంతో ఆయన పేరును ఖరారుచేస్తూ గులాబీ బాస్ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం హనుమకొండ జడ్పీ ఛైర్మన్‌గా సుధీర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
కాగా తొలుత మాజీ మంత్రి కడియం శ్రీహరి కుమార్తె కావ్యను ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. అయితే వారు పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ తరపును పోటీలోకి దిగారు. దీంతో కడియంకు చెక్ పెట్టాలని భావించిన కేసీఆర్.. తాటికొండ రాజయ్య(Rajaiah)ను అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఆయన పోటీకి నిరాకరించారని.. అందుకే సుధీర్(Marepalli Sudhir Kumar)ను ఎంపిక చేశారని తెలుస్తోంది.