ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్(BRS) పార్లమెంటరీ పార్టీ సమావేశం అయింది. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) అధ్యక్షతన ఈ భేటీ జరుగుతోంది. ఈ సమావేశంలో లోక్ సభ(Lok Sabha), రాజ్యసభ(Rajya Sabha) ఎంపీలు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఎంపీలకు వచ్చే పార్లమెంటు బడ్జెట్ సమావేశాలపై కేసీఆర్ సూచనలు చేస్తున్నారు.
పార్లమెంటు సమావేశాల్లో ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి? ఎటువంటి వైఖరితో ముందుకెళ్లాలి అనే అంశాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. అలాగే సమావేశాలు ముగిసిన తర్వాత సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ రానుంది. దీంతో సమావేశాల్లో రాజకీయంగా ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశాల పైనా చర్చలు జరుపుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ పై BRS ఏ స్టాండ్ తీసుకోవాలో సూచించే ఛాన్స్ ఉంది. కాగా, కేసీఆర్ ప్రమాదానికి గురైన తర్వాత జరుగుతున్న రాజకీయ భేటీ కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. భేటీ అనంతరం ఆయన ఏం మాట్లాడనున్నారు అనే ఉత్కంఠ మొదలైంది. సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్ బీజేపీతో జత కడతారా? ఒంటరిగానే పోరాడతారా అనే చర్చలు సాగుతున్న నేపథ్యంలో దీనిపై కామెంట్ చేస్తారేమో అని అంతా ఎదురు చూస్తున్నారు.