తెలంగాణ భవన్ వేదికగా జరుగుతున్న బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ సీఎం, బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్(KCR) పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలైందని, ఒక్కటంటే ఒక్క విషయంలో కూడా సక్సెస్ కాలేదని అన్నారు. ‘‘తెలంగాణ కోసం బీఆర్ఎస్(BRS) మాత్రమే పోరాడగలదు. ప్రజల కష్టాలను బీఆర్ఎస్ ఒక్కటే అర్థం చేసుకోగలదు. వారి కష్టాలను తీర్చగలదు. ప్రజల సమస్యలకు పరిష్కారం చూపే సత్తా ఉన్న పార్టీ బీఆర్ఎస్ ఒక్కటే. రాష్ట్రంలో వందకు వందశాతం బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పకుండా వస్తుంది. పోరాడి సాధించుకున్న తెలంగాణ మళ్ళీ వెనక్కిపోతోంది. పాతికేళ్ల స్ఫూర్తితో మళ్ళీ తెలంగాణను నిలబెట్టుకోవడానికి పోరాడాలి’’ అని పిలుపునిచ్చారు.