Palamuru Rangareddy Project | పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పించాలంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొన్నేళ్లుగా శ్రమిస్తోంది. 2022లో ఈ మేరకు ప్రతిపాదనలను కేంద్రానికి కూడా పంపింది. తాజాగా ఇదే అంశంపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి(Chamala Kiran Kumar Reddy).. పార్లమెంటులో ప్రశ్నించారు. దీంతో ఈ అంశంపై జలశక్తి శాఖ సహాయక మంత్రి రాజ్ భూషణ్ చౌదరి(Raj Bhushan Choudhary) లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. అందులో పాలమూరు ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా కల్పించలేమని తేల్చి చెప్పారు.
అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను వెనక్కు పంపేసింది. కృష్ణా నది జలాలపై ఆంధ్ర, తెలంగాణ మధ్య భారీ వివాదం జరుగుతుందని, ఈ వ్యవహారం సుప్రీంకోర్టులో ఉందని, కృష్ణా ట్రిబ్యునల్ 2 ఇందుకు సంబంధించిన విచారణ చేపడుతుందని కేంద్రం గుర్తు చేసింది. కోర్టు వివాదం నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్(Palamuru Rangareddy Project) టెక్నో ఎకనామిక్ రిపోర్ట్‌ను పరిగణనలోకి తీసుకోవడం సాధ్యం కాదని కేంద్ర జలశక్తి శాఖ తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో ప్రతిపాదనలు తెలంగాణ రాష్ట్రానికి తిరిగి పంపినట్లు లోక్‌సభలో కేంద్రం వివరించింది. 2022 సెప్టెంబర్‌లో తెలంగాణ నుంచి ప్రతిపాదనలు వచ్చాయని, 2024 డిసెంబర్‌లో ఈ ప్రతిపాదనలను తిప్పి పంపామని కేంద్రం చెప్పింది.