వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఎవరు ఆపలేరని సీఎం కేసీఆర్(KCR) ధీమా వ్యక్తం చేశారు. సూర్యాపేట(Suryapet) జిల్లాలో పర్యటించిన ఆయన ప్రగతి నివేదన సభలో ప్రసగింస్తూ ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా జిల్లాకో మెడికల్ కాలేజ్ ఇస్తున్నామని చెప్పారు. తలసరి ఆదాయంలోనూ తెలంగాణ నెంబర్ వన్‌లో ఉందన్నారు. సీఎం నిధి నుంచి గ్రామ పంచాయతీలకు పది లక్షలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. రూ.37వేల కోట్లతో రైతు రుణమాఫీ చేసిన ఘనత తమదని పేర్కొన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాల్లో గులాబీ పార్టీ అభ్యర్థులను గెలపించాలని కోరారు.
Suryapet | ఎన్నికలు వస్తున్నాయని విపక్షాలు మళ్లీ డ్రామాలు మొదలుపెట్టాయని విమర్శించారు. ఒకడు మోటార్లకు మీటర్లు పెట్టాలని అంటే మరొకడు మూడు గంటల కరెంటే అంటున్నాడని మండిపడ్డారు. ధరణి తీసేస్తే రైతులకు బీమా ఎలా వస్తుంది? అని ప్రశ్నించారు. మళ్లీ మనకు పాత రోజులు రావాలా? అని నిలదీశారు. విపక్షాలు అరచేతిలో వైకుంఠం చూపిస్తే మోసపోవద్దని.. మోసపోతే మళ్లీ గోస పడుతామని ప్రజలకు సూచించారు. ఈ ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలని.. మూడో సారి కూడా BRS గెలువబోతోందని ఇందులో ఎలాంటి డౌట్ లేదన్నారు. గతంలో కంటే ఈసారి ఐదారు సీట్లు ఎక్కువే వస్తాయని ఆశాభావం వ్యక్తంచేశారు.
మరోవైపు ఎన్నికల యుద్దానికి గులాబీ బాస్ సిద్ధమయ్యారు. సోమవారం తెలంగాణ భవన్ వేదికగా 90 నుంచి 105 మందితో కూడా అభ్యర్థుల తొలి జాబితాను అధికారికంగా విడుదల చేయనున్నారు. ఇక మొదటి లిస్టులో దాదాపుగా సిట్టింగులకే సీట్లు ఖరారయినట్టు సమాచారం. కొన్ని స్థానాల్లో మాత్రం స్థానిక పరిస్థితుల దృష్ట్యా అభ్యర్థుల మార్పులు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది.