హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో స్వాంతంత్ర్య భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. శుక్రవారం జరిగిన ఈ వేడుకలకు ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) చీఫ్ గెస్ట్‌గా హాజరై ప్రసంగించారు. భారత స్వాతంత్ర్య సమరం ప్రపంచ చరిత్రలో ఒక మహోన్నత పోరాటమని కొనియాడారు. స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను ధారపోసిన మహనీయుల త్యాగాలను ఘనంగా స్మరించుకోవటం ప్రతి భారతీయుడి బాధ్యత అని గుర్తుచేశారు. భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రను, ఆదర్శాలనూ, నేటి తరానికి తెలియజేయాలనే సత్సంకల్పంతో గత సంవత్సరం వజ్రోత్సవాల ప్రారంభ వేడుకలను ఎంతో ఘనంగా 15 రోజులపాటు నిర్వహించుకున్నాం.
నేడు ముగింపు ఘట్టానికి చేరుకున్నాం. ఈ ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన అనేక కార్యక్రమాలలో రాష్ట్ర ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారని కేసీఆర్(CM KCR) తెలిపారు. ఈ వేడుకల్లో భాగంగా 30 లక్షల మంది విద్యార్థినీ విద్యార్థులకు మహాత్మాగాంధీ చలనచిత్రాన్ని చూపించినందుకు నాకు చాలా సంతోషంగా ఉందని కేసీఆర్ పేర్కొన్నారు. సమాచార ప్రజా సంబంధాల శాఖ, విద్యాశాఖల అధికారులు, సిబ్బంది ఈ పనిని ఎంతో సమర్థవంతంగా నిర్వహించారు. వారికి నా అభినందనలు అని సీఎం తెలిపారు.