తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గర్భిణీ మహిళలలో రక్తహీనత, పోషకాహార లోపాన్ని నివారించేందుకు ‘కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లను(KCR Nutrition Kits)’ ప్రవేశపెట్టింది. నిజానికి ఈ పథకం ఇప్పటికే తెలంగాణలో 9 జిల్లాల్లో ప్రారంభం కాగా.. తాజాగా రాష్ట్రమంతా అమలు చేస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్‌లో నిమ్స్ దశాబ్ది బ్లాక్ నిర్మాణానికి సీఎం కేసీఆర్(KCR) భూమిపూజ చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేశారు. గర్భిణుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని తీసుకొచ్చిన ఈ కిట్లను తొలుత ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్, ములుగు, నాగర్ కర్నూల్, వికారాబాద్ జిల్లాల్లో అందించగా ఇప్పుడు రాష్ట్రమంతా అమలు చేస్తామని తెలిపారు. ఇక ఈ కిట్(KCR Nutrition Kits) విలువ రూ. 2 వేలుగా ఉంటుంది.