దేశం మొత్తంలోనే రేవంత్ రెడ్డి(Revanth Reddy) లాంటి సీఎం మరొకరు లేరని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) వ్యాఖ్యానించారు. ప్రజలు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేకపోయిన సీఎం మన దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి ఒక్కరేనని చురకలంటించారు కిషన్. తన వరంగల్ పర్యటనలో భాగంగా కిషన్.. రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్(BRS)పై విమర్శల వర్షం కురిపించారు. ‘‘కాంగ్రెస్ పార్టీ వంద రోజుల్లో 6 గ్యారెంటీలు(6 Guarantees) అమలుచేస్తామని చెప్పి చేయలేదు. ఇచ్చిన హామీలు అమలుచేయాలేని నిస్సహాయ స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ప్రజా వ్యతిరేకతను మరల్చేందుకు లేని విషయాలను సీఎం మాట్లాడుతున్నాడు. దేశంలో ఏ సీఎం కూడా ప్రతీ వారం ఢిల్లీకి వెళ్లరు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రతీ వారం డిల్లీలో అటెండెన్స్ వేసుకోవాలి. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ కు గడ్డు కాలమే. మోడీ పైన, కేంద్రంపైన మాట్లాడినంత మాత్రాన నీ వైఫల్యాలు ప్రజలు మర్చిపోరు. రాబోయే రోజుల్లో నీ వైఫల్యాలపై బీజేపీ పోరాటం చేస్తుంది’’ అని అన్నారు.
కేసీఆర్ బాటలోనే రేవంత్
‘‘ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్(KCR) కుటుంబం దోపిడీ చేసిందని రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే బాటలో నడుస్తున్నారు. అందినకాడికి అప్పులు చేసి, రాష్ట్రాన్ని దివాళా తీసే పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. భూములు అమ్మడం, సొమ్ము చేసుకోవడమే లక్ష్యంగా రేవంత్ సర్కార్ పనిచేస్తోంది. వనరులు సమకూర్చుకునే అంశంలో ప్రణాళిక లేదు. ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు రోడ్డు మ్యాప్ కూడా లేదు. గుడ్డి ఎద్దు చేనులో పడ్డట్లు కాంగ్రెస్ పరిపాలన ఉంది. ఘాటుగా, ఆవేశంగా మాట్లాడితే ప్రజలు ఎక్కువ రోజులు భరించరు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు ఒకే తాను ముక్కలు, దొందూ దొందే’’ అని Kishan Reddy చురకలంటించారు.