తెలంగాణ క్యాబినెట్(Telangana Cabinet) సమావేశం ముగిసింది. అజెండలోని 22 అంశాలపై చర్చించిన మంత్రివర్గం.. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రైతుభరోసా(Rythu Bharosa)కి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఇందిరమ్మ ఇళ్లు, బీసీ రిజర్వేషన్, రేషన్ కార్డుల జారీ, సన్నబియ్యం పంపిణీ, మండలాల ఏర్పాటుపై కేబినెట్‌లో చర్చ జరిపింది. అనంతరం రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రైతు భరోసా పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.
వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికి రైతు భరోసా(Rythu Bharosa) ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు సీఎం తెలిపారు. ఏడాదికి ఎకరానికి రూ.12 వేలు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. భూమిలేని వ్యవసాయ కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం పేరుతో ప్రతి ఏటా రూ.12 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. రేషన్ కార్డు లేనివారికి నూతన రేషన్ కార్డులు అందిస్తామని చెప్పారు. ఈ నెల జనవరి 26వ తేదీ నుండి పథకాలు అమలు చేస్తామని సీఎం ప్రకటించారు. వ్యవసాయ యోగ్యం కాని భూములు, మైనింగ్, రియల్ ఎస్టేట్ భూములకు రైతు భరోసా ఉండదని క్లారిటీ ఇచ్చారు. రోడ్లు, గుట్టలు, రియల్ ఎస్టేట్, పరిశ్రమలకు తీసుకున్న భూములకు రైతు భరోసా వర్తించదని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు.